ఎన్నికల ఎఫెక్ట్ బ్యాంకులపై కూడా పడుతోంది. ఎన్నికల బరిలో దిగిన సందర్భంగా జరిగే ఆసక్తికర ఎపిసోడ్‌లకు బ్యాంకులు కూడా వేదికలయ్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్రమైన దరఖాస్తు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ దరఖాస్తు చేసుకున్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి తనకు రుణం మంజూరు చేయాలంటూ కె.వెంకటనారాయణ ఈ దరఖాస్తు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవకు అంకితం కావాలని ఉందని పేర్కొన్న వెంకట నారాయణ.. పోటీకి చాలా డబ్బులు ఖర్చవుతాయని, కాబట్టి రుణం ఇవ్వాలంటూ సోమవారం నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రంగాల వారికీ రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రుణాలు ఇవ్వాలన్నారు. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్రపతి, గవర్నర్‌లకు గతంలోనే ఈ డిమాండ్‌తో లేఖలు రాసినట్టు వెంకటనారాయణ తెలిపారు.