కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో తలపెట్టిన సమర శంఖారావం సభలో వైయస్ జగన్ ఢంకా కొట్టి ఎన్నికల నగారా మోగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపధ్యంలో ఊహకందని విధంగా ఎన్నికల తేదీ ఖరారైంది.
పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. దీంతో వైసీపీ అధినేత సమర శంఖారావం వేదికగా విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న జగన్, 15వ తేదీనుంచి బస్సుయాత్రతో రాష్ట్రమంతా మరోసారి చుట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో వైసీపీ శ్రేణులు జగన్ టూర్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.