ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నుంచి వైసీపీలోకి మరో ఎమ్మెల్యే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయిన నాటినుంచీ విష్ణుకుమార్ రాజును ఆయన అనుచరులు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయ పార్టీవైపు వెళ్లాలని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ధైర్యంగా ప్రకటించారు. వైసీపీతో సంప్రదింపులు జరిగినట్టుగా కనిపించలేదు.. జగన్ పాదయాత్ర ద్వారా విశాఖ వచ్చి, వెళ్లిపోయినా కూడా ఆయన జగన్ ను కలవలేదు. దాంతో వైసీపీలోకి ఆయన వెళ్లేది లేదని అందరూ భావించారు. తర్వాత ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీలో చేరడానికి విష్ణుకుమార్ రాజుకు ఏమాత్రం ఇష్టం లేదట.. విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ తరపున గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తా కానీ ఏ పార్టీ నుంచో మాత్రం ఇప్పుడే చెప్పనని గతంలోనే ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థితిలో లేదని, ఆపార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని మాత్రం చెప్పవచ్చు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ ఆయన నిర్ణయంపై ఎదురుచూపులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎప్పుడో అస్త్రసన్యాసం ప్రకటించారు. ఇక మిగిలిన ఎమ్మెల్యే మాణిక్యాలరావు పోటీ చేస్తారో లేదో అనే అనుమానమూ కలుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ కీలక నేత అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు తప్పని పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లనున్నారనే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. రాజుగారికి పార్టీలతో పాటు తన నియోజకవర్గంలోనూ మంచిపేరుంది. నియోజకవర్గంలో తనకు ఎంత మంచి పేరున్నా పార్టీ ప్రభావం కచ్చితంగా పడుతుందని, ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరపడడానికి ముందే వైసీపీలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. వైసీపీ తీర్థం పుచ్చుకొని ఫ్యాను గుర్తుపై విష్ణు కుమార్ రాజు వైసీపీ అగ్ర నాయకుల్లో ఒకరవుతారంటూ ఆయన అభిమానులు కొందరు జోస్యం చెబుతున్నారు.
