ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైయస్ఆర్ సీపీలో చేరారు. జగన్ చెల్లాకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యాభై ఏళ్లుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్ కలిగిన చల్లా నిర్ణయంతో జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చకపోవడవతొ చెల్లా చేరికను కర్నూలు జిల్లా పార్టీ నేతలు స్వాగతించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని, జగన్ నవరత్నాలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని, చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తాను వైఎస్సార్, ఎన్టీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో పెద్ద పదవులు అనుభవించలేదని, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. మూడుసార్లు చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు.
