ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా.? అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై పార్టీ నేతలతో కలిసి జగన్ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ దేశచరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా.? గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం.
ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు రెండేళ్లనుంచే ప్రజలడేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారన్నారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలని కోరారు. ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా.? కలర్ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్లలో ఎలా కనబడతోందన్నారు.
ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక్తిటగత వివరాలు ప్రయివేట్ సంస్థల వద్ద ఉండకూడదు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్ కంపెనీలో డేటా దొరకడం సబబేనా అని ప్రశ్నించారు. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధిలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, వివరాలు, కలర్ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా అని ప్రశ్నించారు.