గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారున్నారు. టీడీపీకి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారన్నారు.
ఇదంతా పథకం ప్రకారం చేసారని, ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఎందుకంటే గతంలో కేవలం తాము 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. వైసీపీ చేసిన స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయని, జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చామన్నారు. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారన్నారు.
ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత అన్నారు. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మరోసారి ఈసీని కలుస్తామని, వైసీపీ ఓట్లన్నీ మళ్లీ రిజిష్టర్ చేయించుకునేలా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు దొంగఓట్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించేవరకూ పోరాడుతామన్నారు.