కరీంనగర్ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి కరీంనగర్ ప్రజలు చూపించిన తెగువను కొనియాడారు. 2006 లో తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉంది అని కాంగ్రెస్ నాయకులు హేళన చేసిన సందర్భంలో కేసీఆర్ గారు కేంద్రం నుండి తప్పుకొని ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి రుచి చూపించిన ఘనత కరీంనగర్ ప్రజలకే చెందుతుంది అన్నారు. మొదటి నుండీ తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి, మిగితా జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచిన కరీంనగర్ ప్రజలను చైతన్యాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
2014లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో శాసన సభ్యులను గెలిపించిన ఘనత మీకే దక్కుతుంది అని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం తిరిగి ఏడు నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారని ఇదే స్పూర్తితో మన ముందు ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని తిరిగి భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున 11 మంది సభ్యులను గెలిపించి లోక్‌సభకు పంపించాం. నాటి ఎన్నికల్లో మోదీ అంటే ఓ భ్రమ. దేశాన్ని ఉద్దరిస్తాడు అని బీజేపీకి 283 సీట్లను కట్టబెట్టారు. నాడు ఎవరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏన్డీయే ప్రభుత్వం ఈ ఐదేండ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఏన్డీయే కూటమికి 150 సీట్లు వచ్చేది కష్టమే. కాంగ్రెస్‌కు 100 నుంచి 110 సీట్లు వచ్చేది కష్టమే. ఈ రెండు కలిపితే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. రేపటి రోజున మొత్తం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. ఢిల్లీ గద్దె మీద మనం కీలకం కాబోతున్నాం. తద్వారా ఎవరూ ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే శక్తి మనకు ఉంటుందన్నారు.
రాహుల్, మోదీ దొందూ దొందే అని ప్రజలకు తెలిసిపోయింది. వీరిద్దరూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకున్నదే తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు. ఢిల్లీలో ప్రబలమైన శక్తిగా ఉంటే తప్ప మన హక్కులు సాధించుకోలేం. మన 16 మంది ఎంపీలకు మరికొంత మంది తోడు అవుతారనే నమ్మకం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి 70 స్థానాలకు తగ్గకుండా.. 100 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి. మొత్తంగా 100 స్థానాలతో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉంది. కేసీఆర్ లాంటి మేధోసంపత్తి గల నాయకుడు.. ఏ విధంగానైతో తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారో.. ఆ విధంగా కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తాయి. దీంతో ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు శ్రీ కేశవరావు, హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాససభ్యులు, ఎమ్మెల్సీలు మరియు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.