వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని టీడీపీ ఈ దురాగతానికి పాల్పడుతోంది. ఓటరు తన ఓటును తొలగించాలంటూ తానే ఫామ్–7 దరఖాస్తును ఇచ్చినట్లు బోగస్ సంతకాలతో దరఖాస్తులు నింపి ఎన్నికల అధికారులకు కుప్పలుతెప్పలుగా టీడీపీ నేతలు సమర్పించారు.
పథకం ప్రకారమే ఓట్లు తొలగింపు చేస్తున్నారు. ఫామ్–7 దరఖాస్తులు ఇచ్చే బాధ్యతలను నియోజకవర్గాలవారీగా అధికారపార్టీ నేతలకు టీడీపీ అప్పగించింది. అధికార పార్టీ అక్రమంగా ఓట్ల తొలగింపు కోసం ఫామ్–7 దరఖాస్తులను ఇవ్వడాన్ని గుర్తించిన వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజులుగా ఎన్నికల అధికారుల కార్యాలయాల వద్దే ఉండి వెరిఫికేషన్ కోసం పట్టుబట్టారు. కొన్ని దరఖాస్తులు వైసీపీ నేతల పేరునే ఇచ్చి ఉండడాన్ని గమనించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు సైతం నమోదు చేయించారు. విచారణను వేగవంతం చేయాలని పట్టుబడుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు, పోలీసులు స్పందిచడం లేదు. ప్రశ్నించిన వైసీపీ నేతలపై పోలీసులు అక్రమకేసులు పెడుతున్నారని ఆపార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.