డాటా దొంగతనం చేసిందే కాకుండా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందించారన్నారు. ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు వస్తే స్పందించటం తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
“అమరావతిలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పర్యటిస్తున్నాడని అనుకుందాం. ఆయన పర్సు దొంగతనం జరిగితే అమరావతిలో కంప్లైంట్ చేస్తారే కానీ అమెరికాలో కాదు కదా? అమరావతి పోలీసులు దర్యాప్తు చేస్తారే కానీ అమెరికా పోలీసులు కాదు కదా? ఇదే రీతిలో తాజా దర్యాప్తు జరుగుతోంది.అయినా మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు. మా మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి“ అని మండిపడ్డారు. ఐటీ గ్రిడ్ సంస్థ తప్పు చేయకపోతే బాబుకు భయమెందుకు అని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే క్లీన్ చీట్ కూడా ఇస్తారని పేర్కొన్నారు. మీ డేటాతో మాకేం పని అని, ప్రజల్లో పరపతి పోయాక బాబు ఇలాంటి కుయుక్తులు పన్నుతారన్నారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.