తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 2009, 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీ చేయబోదని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ అజారుద్దీన్‌ను సరైన వ్యక్తిగా గుర్తించి ఈ మేరకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అజారుద్దీన్, అసదుద్దీన్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
గత ఏడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికల సమయంలో 56 ఏళ్ల అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన విషయం తెలిసిందే. క్రికెట్ నుంచి రిటైరైన అజారుద్దీన్ 2009లో మోర్దాబాద్(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టోంక్సవాయి మదోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అజారుద్దీన్ ఓటమి పాలయ్యారు.
Post Views: 325