ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ,తెలుగుదేశం పార్టీలోని చిత్రమైన రాజకీయాలకు మరో నిదర్శనం ఇది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ తగిలింది. అరకు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై చంద్రదేవ్ పోటీకి దిగితే, కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేస్తానని ఆయన కుమార్తె శృతిదేవి ప్రకటించారు. విజయనగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ. తన తండ్రిపై ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అరకు లోక్ సభ టికెట్ కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేశానన్నారు. తాను గత 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నట్లు శృతిదేవి తెలిపారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కిశోర్ చంద్రదేవ్ కుటుంబం కురుపాం రాజవంశీకులు. చంద్రదేవ్ ఇప్పటివరకూ 5 సార్లు లోక్ సభకు, ఓసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి ఏర్పడ్డాక ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
