తెలుగుదేశం పార్టీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా నియోజకవర్గ టీడీపీ నేతలతో ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నియోజకవర్గ నేతలు తమ అనుయాయులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా పరిశీలకులతో ముఖ్యమంత్రి నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో జవహర్‌కు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక వేళ టిక్కెట్టు ఇస్తే, ఓడిస్తామంటూ హెచ్చరించారు. ఈసందర్భంగా మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ తాను కొవ్వూరు నుంచే తిరిగి పొటీ చేస్తానని స్పష్టం చేశారు. కొంతమంది పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి సంగతి పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
Post Views: 268