ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తొలినుంచి గళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు ఈ విషయంలో తన వైఖరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీలు తమ వాగ్దానాన్ని నిలుపుకోవడంలో విఫలయ్యాయని ఆయన అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో జగన్ వివరించారు. 60 ఏళ్ళ ఉమ్మడి అభివృద్ధికి హైదరాబాద్ నిదర్శనమని… ఏపీలో డిగ్రీ చేసిన ఏ విద్యార్థి అయినా ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వస్తోందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు. అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు, రాయితీలతోనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని జగన్ స్పష్టం చేశారు.
అన్ని వనరులు ఉన్న ఏపీకి హోదా ఎందుకు అన్న ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్ని అసంబద్ధంగా చీల్చుతూ… రెండు పార్టీలు ఇచ్చిన హామీ… ప్రత్యేక హోదా అని.. ఇపుడు దాన్ని ఇవ్వనంటే… ప్రజలకు పార్లమెంటుపై విశ్వాసం పోతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల వైఖరితో ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా… హోదా ఇచ్చే పార్టీకి తాము మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. “రాహుల్.. మీరు (కన్వాల్) అధికారంలోకి వచ్చినా… హోదా ఇస్తామంటే మద్దతు ఇస్తాం` అని అన్నారు.