కర్నూల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వెడెక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మాకు అంటే మాకు ఇవ్వాలాని నియోజక వర్గ ఇంచార్జులు చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. తాజాగా మరోసారి ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీ టీడీపీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆమెకు టికెట్ కేటాయిస్తే తాము ఓటు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ను కాదని కోట్ల సుజాతమ్మకు నియోజకవర్గ టికెట్ ఎలా కేటాయిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ నేతలంతా కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. మరోవైపు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా టీడీపీ అసమ్మతి నేతలతో కోట్ల కుటుంబం రహస్యంగా మంతనాలు జరుపుతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా… టీడీపీ శ్రేణులు మాత్రం ససేమిరా అంటున్నాయి. కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.