దివంగత మహానేత వైయస్ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు 13 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. పాదయాత్రలో అనేక వర్గాల ప్రజల సమస్యలు, భౌగోళిక పరిస్థితులు ప్రత్యక్షంగా చూశారని, పేదల పరిస్థితులను బట్టి జగన్ వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.
ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని జగన్ నవరత్నాలను ప్రకటించారన్నారు. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏయే అంశాలను ముందుగా పొందుపర్చాలి అనే అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామన్నారు. పార్టీ అనుబంధ విభాగాలతో 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమవుతారని, ఇంకా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తారని, జిల్లా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తారన్నారు. దూర ప్రాంతాల వారు krishnaysrcpoffice@gmail.comకు మెయిల్ పంపించవచ్చని, పార్టీ కార్యాలయానికి కూడా వచ్చి చెప్పాలని సూచించారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.