ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. కాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డేటా బ్రీచింగ్‌కు పాల్పడుతోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన ‘సేవామిత్ర’ అనే యాప్ ద్వారా టీడీపీ ఆంధ్ర ప్రజల సమాచారాన్ని దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. ఆధార్, ఎలక్షన్ కమిషన్ వివరాల ఆధారంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్(ఎస్సార్డీహెచ్)లో నిక్షిప్తమైన డేటాను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘సేవామిత్ర’ ద్వారా ఓటర్ల ఐడీ నంబర్లు, పేర్లు, సామాజికవర్గం, కలర్ ఫొటోలు, వారికి సంబంధించిన బూత్ లెవల్ సమాచారం, కుటుంబ వివరాలు, పొందుతున్న ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను సేకరించి టీడీపీ కార్యకర్తలు.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలో ఐటీ గ్రిడ్ ప్రజల వ్యక్తిగత వివరాలు ఎలా సేకరించిందన్న అంశంపై సైబర్ పోలీసులు దృష్టి సారించారు. ఈ విషయం గురించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… డేటా బ్రీచ్‌కు సంబంధించి ఫిర్యాదు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
