ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు. కొన్ని రోజుల కిందట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. తనతో పాటు తన తనయుడు హితేష్ చెంచురామ్ పార్టీలో చేరుతారని వివరించారు. ఈ కార్యక్రమానికి మార్టూరు, యద్దనపూడి మండలాల నాయకులు, కార్యకర్తలు విరివిగా తరలిరావాలన్నారు. మార్టూరులోని విజయలక్ష్మి కల్యాణ మండపంలో సోమవారం రాత్రి మార్టూరు, యద్దనపూడి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో దగ్గుబాటి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో మార్టూరు, పర్చూరు శాసన సభ్యులుగా 5 సార్లు విజయం సాధించానన్నారు. దివంగత మంత్రి గొట్టిపాటి హనుమంతరావుతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. గొట్టిపాటి భరత్‌తో కూడా సంబంధాలు కొనసాగుతాయన్నారు. తాను రాజకీయాల్లో ఎలాంటి తప్పులు చేయలేదని, జగన్ మాటకు కట్టుబడే మనిషని పేర్కొన్నారు. అందువల్ల జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అనంతరం హితేష్ చెంచు రామ్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చానన్నారు. గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ దగ్గుబాటి గెలుపుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జాష్టి వెంకట నారాయణ, ఉప్పలపాటి చెంగలయ్య, కాకోలు రామారావు, కాకోలు వెంకటేశ్వర్లు, పఠాన్ కాలేషావలి తదితరులు పాల్గొన్నారు.
