ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్‌లాజం ఆధ్వర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. వెలుగోడు పట్టణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకోసం పదేళ్ల నుంచి పోరాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో పట్టం కడదామని పిలుపునిచ్చారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదేళ్లనుంచి ప్రజలకోసం పోరాటాలు చేస్తూ వారి మధ్యలో తిరుగుతున్న జగన్ కు ఒక్క అవకాశమిస్తే మంచి రోజులు వస్తాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ కలలు కన్న సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమని వెల్లడించారు.