ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకపక్క మమ్మల్ని తిడుతూనే.. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్ లో దేవరకద్ర కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో 14కు 13 స్థానాలు గెలిపించిన పాలమూరు జిల్లా ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు.మొన్న జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ప్రజాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు ,రాహుల్ గాంధీ హడావిడి చేశారు.. అయినా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ కే బ్రహ్మరథం పట్టారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడదు. మోదీ, రాహుల్ గాంధీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని అన్నారు.ఏపీలో చంద్రబాబు దుర్మార్గ పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరన్నారు. కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య తేడా నక్కకు నాగలోకానికి అంత ఉందన్నారు. చంద్రబాబు లాగా తమకు కుట్రలు, కుతంత్రాలు చేయమన్నారు. తాము ఏదైనా నేరుగానే చేస్తామన్నారు.