నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రోడ్‌షో నిర్వహించి, తరువాత ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అందువల్ల బాలకృష్ణపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో బాలకృష్ణ వాదనలు వినడం తప్పనిసరని స్పష్టం చేసింది. అందులో భాగంగా బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణకు నోటీసులు అందచేసే వెసులుబాటును పిటిషనర్‌కు కల్పించింది. మరోవైపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.