సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. కలర్స్ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని సూచించించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
