కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శనివారం (రేపు) కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో తిరువనంతపురం లోని అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, ఇండో- అరబ్ ఫ్రెండ్ షిప్ సెంటర్ ప్రతినిధులు ఎంపీ కవిత కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొకేలను అందజేసి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంపి కవిత ఫోటో ప్ల కార్డులతో కవితకు స్వాగతం పలికిన అభిమానులతో ఎయిర్ పోర్ట్ సందడిగా మారింది. ఇండో అరబ్ ఫ్రెండ్ షిప్ సెంటర్ అధ్యక్షులు కళాప్రేమి బషీర్ బాబు, కళా ప్రేమి డెయిలీ మేనేజింగ్ ఎడిటర్ మహమ్మద్ మహీన్, కైరాలి ఫ్రెండ్షిప్ ఫోరం ప్రతినిధి రషీద్, ఇమామ్ బదారుద్దీన్ మౌల్వీ, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ తెలంగాణ శాఖ చైర్మన్ కె. సురేంద్ర న్, అధ్యక్షులు టి.ఎస్.సి ప్రసాద్, కార్యదర్శి ఎం.కె శశి కుమార్, కోశాధికారి టి.వి వర్గీస్, సంతోష్ ఎంపి కవితకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ ఎంపి కవిత కేరళ టూర్ ను సమన్వయం చేస్తున్నారు. శనివారం ఉదయం తిరువనంతపురం ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపి కవిత పాల్గొంటారు. మధ్యాహ్నం కేరళ అసెంబ్లీ లో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.