మంచి మనసున్న పాలకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో … శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ ప్రగతి రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మానవతా బడ్జెట్ ను విశ్లేషిస్తే అర్ధమవుతుంది . ఆయన ఒక ప్రగతి కాముక ఆలోచనల బాండాగారం . పేదల గురించి ఎంత అద్భుతంగా పథకాలను డిజైన్ చేయవచ్చో ఆయన అమలు చేస్తున్న పథకాలను చూస్తే తెలుస్తుంది . సమాజంలోని అన్ని వర్గాల కోణం లో ఆలోచించి నిర్ణయాలు చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది . ఎందుకంటే వరుసగా ముఖ్యమంత్రులు అవుతున్న వాళ్ళు కూడా ఆలోచించలేని విధంగా ఆయన కొత్త కోణంలో ప్రజల గురించి మదనపడుతున్నారు . ఆ ఆలోచన ప్రవాహం నుండి అద్భుతమైన పథకాలకు అంకురార్పణ చేస్తున్నారు . తెలంగాణ లో ప్రజలు ఇంకో వెయ్యేళ్ళు దైర్యంగా బతకగలిగే విధంగా మానవీయ దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నయి . ఒకప్పుడు సమైక్య పాలనలో రైతులు కరెంటు బిల్లులు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎత్తుకొచ్చేవాళ్ళు . ఇప్పుడు అదే ఇంటిని వెతుక్కుంటూ పంట పెట్టుబడి కోసం రైతు బంధు చెక్కు వెళుతున్నది . ఎంత తేడా ఎంత తేడా . ఆకాశానికి భూమికీ ఉన్నంత తేడా . శుక్రవారం ముఖ్యమంత్రి హోదా లో ఆయన ప్రాణం పోసిన పథకాల కేటాయింపుల గురించి ఆయనే చదువుతుంటే యావత్ తెలంగాణ సంబరపడి పోయింది . ఒక్క కేసీఆర్ ఆలోచన ఈ రోజు దేశ ప్రజలందరికీ మేలు జరిగేలా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నది . కేసీఆర్ మానవీయ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రశంసలు అందుకుంటున్నది .