ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, నక్కపల్లి కోఆప్షన్ జడ్పీటీసీ కొప్పిశెట్టి కొండబాబు తదితరులు అనిత విజయానికి పనిచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె తీరు మారిపోవడంతో.. ఒక్కొక్కరుగా ఆమెకు దూరమయ్యారు. రెండేళ్ల పాటు గుంభనంగా ఉన్న వారంతా ఎన్నికల ముంగిట అసమ్మతి గళమెత్తారు. గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, విశాఖ డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ, నక్కపల్లి మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, మరో మాజీ ఎంపీపీ, అతని బందువులు, ఎస్‌రాయవరం పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు దండు గణపతిరాజు, పాయకరావుపేట మాజీ వైస్ ఎంపీపీ గొర్లె రాజబాబు, సీనియర్ నేతలు దేవవరపు వెంకటరమణ, చింతకాయల రాంబాబు, కోటవురట్ల మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వర చంద్రమూర్తి, సీనియర్ నాయకుడు వేగి శ్రీనివాసరావు తదితరులు ఇప్పటికే అనితపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
