ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు ఆగడం లేదు ప్రతి రోజు చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మరో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు..ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నర్సింహం వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే పోతూ పోతూ ఏదో ఒక కారణం చూపాలన్నట్లుగా ఆయన భార్య వాణికి జగ్గంపేట టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ జ్యోతుల నెహ్రూను చంద్రబాబు ఖాయం చేశారు. ఇప్పుడు అదే టికెట్‌ను అడిగితే చంద్రబాబు ఎలాగూ ఒప్పుకోడు..కనుక పార్టీ తన డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే పార్టీ మారాల్సి వచ్చిందనే విషయాన్నిచెప్పుకుని సానుభూతి పొందవచ్చన్నది ఆయన రాజకీయ వ్యూహంగా తెలుస్తోంది. చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన తోట నర్సింహం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక ఈనెల 28న చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరడం ఖాయమైన పక్షంలో తోట నర్సింహం ఈసారి ఎంపీగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తన భార్య సీటు కోసం ఆయన సీఎంని కలిశారు. ఆయన డిమాండును బట్టి.. స్పష్టమైన హామీ లభిస్తే పార్టీలో కొనసాగాలని..లేదంటే వైసీపీలో చేరి టిక్కెట్టు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. టికెట్ల ఖరారు తర్వాత మళ్లీ చాలా మంది నాయకులు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.