ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైసీపీ పార్టీలో చేరుతుండడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. నెల రోజుల నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీకి దగ్గరగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ వైసీపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మరింత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారంతో చంద్రబాబు హైరానా పడుతున్నారు. టీడీపీ పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా చూసేందుకు తన కోటరీలోని ముఖ్యులను చంద్రబాబు రంగంలోకి దింపినా ప్రయోజనం ఉండడం లేదు. జిల్లాల వారీగా ఎవరెవరు వైసీపీలోకి వెళ్లేందుకు అవకాశాలున్నాయో తెలుసుకుని వారిని బుజ్జగిస్తున్నారు. చాలామందితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ బుజ్జగించడం, తన మనుషులను పంపి సర్దిచెప్పడం చేస్తున్నారు. అయిన వెళ్లే వారిని ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో వారిపై ఎదురుదాడి చేయాలని ఇప్పటికే చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది.
