అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మేడా మల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లు వరుసగా వైసీపీకి జైకొట్టడంతో టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరింత మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలనుకుంటున్న వారికి ఫిబ్రవరి 20వ వరకు డెడ్‌లైన్‌గా విధించారని ఈ తేదీకి ఓ వారం అటు ఇటులో చేరేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మరికొందరి టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేంద్రంగా తెలుగుదేశం రాజకీయం నడుస్తోంది. తోట క్యాంపులో కీలక నేతగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ ఆల్రెడీ వైసీపీలోకి వెళ్లిపోయారు. తోట కూడా తాజాగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయ్యారట.. పార్టీ విధివిధానాలు చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో మరి కొద్ది గంటల్లోనే తోట వైసీపీ బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే తోట వంటి బలమైన కాపు నాయకుడు కూడా అధికార తెలుగుదేశాన్ని వదిలి వైసీపీలో చేరుతుండడంతో అసలు జనసేన పార్టీకి రెండు, మూడు సీట్లు వస్తాయనుకున్న తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట.