ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్… గత వారం నుండి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి వలసలు రావడంతో పెద్ద సంచలనంగా మారింది. టీడీపీ నేతలు ఇంకా ఎవరు పార్టీ మారుతారో అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంచలనం జరిగింది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని నాగార్జున జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైసీపీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ను అక్కినేని నాగార్జున కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
