వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి జీవితంలో వెలుగులు నింపాలని ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలని బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ క్లాస్‌లు కాదని భారతదేశ కల్చర్‌ను వేల సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులన్నారు. మీరు వెనుకబడ్డ కులాలు కాదు.. మనజాతికి వెన్నుముక కులాలని గర్వంగా చెబుతున్నానన్నారు. తరతరాలుగా వేసుకునే దుస్తులు, తినే అహారం, ఉపయోగించే పనిముట్టు, ఇళ్లు, త్రాగునీరు, తినే కంచం, మన బట్టలకు పట్టిన మకిలిని వదల్చడం దగ్గర నుంచి వెంట్రుకలకు సంస్కారం తెలిపే వరకు వేలాది సంవత్సరాలుగా బీసీల పాత్ర ఎంత గొప్పదో వేరే చెప్పాల్సిన పనేలేదన్నారు.
భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం, అగ్గిపెట్టెలో చీర, మంగలి సన్నాయి ఏది చూసినా గొప్పతనమేనన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మార్పును కోరుతూ బీసీ గర్జన నిర్వహించానన్నారు. అదేవిధంగా బీసీలకు ఇచ్చిన హామీలు ఎందుకు ఇస్తున్నానో వెల్లడించారు. ఎందుకు హామీలిచ్చారో జగన్ మాటల్లోనే.. 14 నెలల పాటు పాదయాత్ర చేశాను. 3648 కిలోమీటర్లు రాష్ట్రంలోని ప్రతి మూల నడిచాను. పాదయాత్ర మొదలుకాకముందే పార్టీలోని సీనియర్ నాయకులతో బీసీ అధ్యయన కమిటీ వేశాను. ఒక వైపు నేను పాదయాత్ర చేస్తుండగానే జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.
ప్రతీ జిల్లాలోనూ బీసీలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాం.. ఒకవైపు నా అంతకు నేనే బీసీల సమస్యలను తెలుసుకున్నాను. మరోవైపు మన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నలుమూలల తిరిగారు. వీలైనంత ఎక్కువ మందిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కమిటీ లోతుగా వెళ్లి సమస్యల పరిష్కారం దిశగా అడుగులేసింది. వాళ్లు నాకు నివేదికను ఇచ్చారు అక్కడి నుంచి నా మససు పడిన బాధనుండే ఈ హామీలు పుట్టాయి.. వీటిని పరిష్కరించడం కోసమైనా అధికారంలోకి వస్తామే కానీ చంద్రబాబు కోసం అధికారంకోసం హామీలివ్వనన్నారు. కచ్చితంగా బీసీ సోదరులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తానని జగన్ హామీ ఇచ్చారు.