వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలు తరలి రానున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిన మోసాలపై బీసీలు రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని ఏ హామీనీ నెరవేర్చకుండా మోసగించడంపై ప్రస్తుతం బీసీల్లో చర్చ సాగుతోంది.
బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని, 2019 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పాత హామీలను అమలు చేయకుండా కొత్తగా మోసాలు చేసేందుకు చంద్రబాబు ముందుకొస్తుండడంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీసీల సమస్యలను లోతుగా అధ్యయనంచేసి వాటి శాశ్వత పరిష్కార చర్యలపై జగన్ ఏడాదిన్నర క్రితమే పార్టీ బీసీవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో కమిటీ వేసారు.
వీరు రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీసీ వర్గాల స్థితిగతులనూ కమిటీ తెలుసుకుంది. ఈక్రమంలో 136 కులాలవారితో చర్చించి వారి సమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నామని జంగా తెలిపారు. వీరు ఓ సమగ్ర నివేదిక రూపొందించి ఈఏడాది జనవరి 28న జగన్‌కు సమర్పించారు. బీసీ గర్జన సభలో జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. బీసీలపై గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించడానికి తీసుకునే ప్రత్యేకచర్యలు.
సంప్రదాయకంగా కుల వృత్తులపై ఆధారపడే వారి పరిరక్షణ, వారు నిలదొక్కుకునే విధంగా ప్రోత్సాహకాలు, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థికంగా బీసీలు ఎదగడానికి వీలుగా పారిశ్రామికరంగంలో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి బీసీ డిక్లరేషన్‌లో ఉండే అవకాశం ఉందట. ఇప్పటికే ఏలూరు పరిసరాల్లోని సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బీసీ గర్జన వేదికను నిర్మించి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.