ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ఆయన భయంతో చేసిందా లేక గౌరవంతో చేసిందా అనేది అర్థః కాకుండా ఉందంటున్నారు. ఇంతకీ లోకేష్ చేసిన ప్రకటన ఏంటంటే లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగడం గురించి. ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, తనకైతే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉందని…కానీ నిర్ణయం మాత్రం తన తండ్రిదేనన్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే బలమైన కోరికను లోకేష్ మీడియా ముందు బయటపెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివర్గంలో ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని వివరించారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే విషయంపై మాత్రం నాన్నగారిదే ఫైనల్ డెసిషన్ అన్నారు. పోటీ చేయాలా..వద్దా అనే విషయం సీఎంగారే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఇంతకీ ఈ ప్రకటనతో లోకేష్ తన తండ్రి జవదాటని నేతగా నిరూపించుకున్నారా? లేకపోతే, ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కునేందుకు భయపడుతున్నారా? అనే చర్చ జరుగుతోంది.