సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తాజాగా అదే రీతిలో స్పందించారు. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం తమకు హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ‘మాది పగిలిపోయే గ్లాస్ కాదు, తొక్కితొక్కి ఊడిపోయే సైకిల్ కాదు, తుప్పుపట్టిన ఫ్యాన్ కాదు.. మాది హెలికాఫ్టర్’ అని అన్నారు
శనివారం సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని చెప్పారు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమతో ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేఏ పాల్ చెప్పారు. పవన్ కల్యాణ్ నాతో కలవకపోతే జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటూ జోస్యం చెప్పారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పాల్… ఐదేళ్లు వితంతు ఫించను గుర్తుకిరాని చంద్రబాబుకు, చివరి మూడు నెలలు ఫించన్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.