కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కాపు అగ్ర నాయకులు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే పాటిజివ్‌గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై కాపులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రచారం చేసిన టీడీపీ సర్కార్ క్షేత్రస్ధాయిలో ఆగ్రహ పరిస్థితిని గమనించి కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇస్తామని ప్రకటించింది. అయితే అగ్రవర్ణ పేదలకు కేటాయించిన రిజర్వేషన్లలో తమకు వాటా దక్కడం సాధ్యం కాదన్న అంచనాలతో కాపు సామాజిక వర్గం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న పరిస్ధితులకు పరాకాష్టగా రాష్ట్రంలోని చీరాల, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే ఆమంచి వైసీపీలో చేరారు. చంద్రబాబు చర్చలకు ఆహ్వానించినా వెళ్లకుండా రామచంద్రాపురం వెళ్లి తోట త్రిమూర్తులతో ఆమంచి భేటీ కావడం ప్రభుత్వ వర్గాలకు సైతం మింగుడుపడట్లేదు. ఇప్పటికే వైసీపీకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమంచితో పాటు తోట త్రిమూర్తులు త్వరలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. వీళ్లతోపాటు మరో ఐదుగురు కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో పాటు మరో 11మంది ఇతర ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది.
జగన్ కూడా దాదాపుగా లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది. అదే జరిగితే గత ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు అండతో గోదావరి జిల్లాలతో పాటు కీలక నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ ఈసారి దారుణంగా ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనపై కనీసం ఎవ్వరికీ నమ్మకం లేకపోవడం ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతోంది. కాపు ఓటుబ్యాంక్ వైసీపీ వైపు మళ్లొచ్చన్న అంచనాలతో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆపార్టీలో ఉండేదుకు ఇష్టపడటం లేదు. ఈ వరుస పరిణామాలన్నీ కాపు నాయకులు ముందే ఊహించారు.. చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అణచివేసి అవమానించిన ఘటనలను మర్చిపోలేదు. గతంలో దివంగత దాసరి నారాయణ కూడా జగన్ ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. అప్పటినుంచీ కాపుల్లో చాలామంది జగన్ నిజాయితీకి ఆకర్షితులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులుతో పాటు పలువురు పెద్దలు సైతం వైసీపీలోకి రానున్నారని స్పష్టమవుతోంది.