జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. తెగిపడిన శరీర అవయవాలతో రహదారి రక్తమోడింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై తామే దాడి చేసినట్లు జైషే ఈ మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అక్కడికి రాగానే ఆ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం ముక్కలు ముక్కలైంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం తొలుత తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఆ తర్వాత గ్రనేడ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.