ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి…ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైసీపీలో చేరతా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. నేను పార్టీ మారడానికి.. నా అసెంబ్లీ సమస్యలే కాదు, అనేకం ఉన్నాయి. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నాలుగున్నరేళ్లుగా నేను చీరాల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసాను అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.
