దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర సినిమాను చాలా బాగా తీశారు.
కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. తన పాత్రను పోషించిన ఆశ్రితను విజయమ్మ అభినందించారు.