చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనాలు కోసమేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని, ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిలీల్లో ఖర్చుపెట్టిన రూ.10కోట్లతో చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని, ప్రజల డబ్బు దుబారా చేసి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డబ్బులు ఖర్చుపెట్టుకోవచ్చని, పార్టీ ఈవెంట్‌లకు ప్రజాధనాన్ని ఖర్చుచేయడం పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపితే ఎందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెళ్లలేదని, చంద్రబాబు ఎఐసిసి కోశాధికారిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. నార్త్ ఇండియా వెళ్లకుండానే ఆ మూడు రాష్ట్రాల్లో విజయంలో నా పాత్ర ఉందని చంద్రబాబే చెప్పుకున్నారని, చంద్రబాబు చేత రాహుల్ గాంధీ నీచంగా తిట్టించుకున్నారన్నారు. రాహుల్ తల్లిని, వంశాన్ని కూడా తిట్టారని గుర్తుచేశారు. నేడు రాహుల్, చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, పౌరుషం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు ఒక్క టీడీపీ ఎంపీ కూడా మాట్లాడలేదని, రాహుల్ గుంటూరు వెళితే ఆయనపై రాళ్లు వేయించారని, ఇప్పుడు రాహుల్ ఏవిధంగా కాంప్రమైజ్ అయ్యారని ప్రశ్నించారు.
