దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్ర యూనిట్‌ను వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ అభినందించారు. ఈ చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ… యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా… యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది.
