స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంట కలిపారని అందుకు గాను ఆయన ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీ రామారావు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారని చెప్పారు. అయినా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించి ఎంతో గౌరవించేవారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో వచ్చినప్పుడు ఆ మర్యాదను పాటించారని చెప్పారు.
తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావుని ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చి మరీ గౌరవించారని గుర్తు చేసారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్వయానా ఎన్టీఆర్ అల్లుడే కానీ రామారావు పాటించిన రాజనీతి ధర్మాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించడం పార్ట్టీ నాయకుడుగా ఆయన ఇష్టం కానీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వార్థ రాజకీయాల కోసం ఇంతగా దిగజారిపోయి దేశంముందు రాష్ట్రం పరువు తీశారన్నారు. అయినా ఇదేదో వీరోచిత కార్యం అనుకుంటే పొరపాటేనని కచ్చితంగా క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర ప్రజలు క్షమించరని హెచ్చరించారు.