ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ న్యాయ పోరాటం కోసరమే మనమందరం ఇక్కడకు వచ్చాం.
మహాత్మాగాంధీ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ఆత్మ సాక్షిగా మనందరం ఇక్కడ సమావేశమయ్యే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్నారు. పార్లమెంట్ లో విభజన చట్టం పెట్టి, హామీలెన్నో ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారని, హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో, నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ హామీల అమలుకు నిరంతరం పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు.
తాను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారని, ఆ అవసరం ఇప్పుడు ఏమొచ్చిందని ప్రశ్నించారు. గోద్రా అల్లర్లలో గుజరాత్ పాలకులు ధర్మాన్ని విస్మరించారని నాడు వాజ్ పేయి స్వయంగా వ్యాఖ్యానించారని, వారే ఇప్పుడు పాలకులుగా ఉన్నారని మోడినుద్దేశించి విమర్శించారు. గోద్రా అల్లర్లకు మత కలహాలకు కారకులు నరేంద్రమోడియేనంటూ విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదని, ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హస్తినకు వచ్చామన్నారు.
అయితే చంద్రబాబు రాష్ట్రం కోసం దీక్ష చేసినా, రాజకీయ లబ్ధికోసం ఏవైనా కార్యక్రమాలు చేసుకున్నా తప్పులేదు కానీ ఇలా ఎన్డీయేలో ఉన్నప్పుడు మోడిని పొగిడి బయటకు వచ్చి మోడిని వ్యక్తిగతంగా అలాగే బీజేపీ కి మొత్తం డ్యామేజ్ అయ్యేలా పాత అంశాలను లేవనెత్తడంపై బీజేపీ అగ్రన్యాయకత్వం సీరియస్ అయిందట.. దీనిని తిప్పి కొట్టడంతోపాటు చంద్రబాబు సాక్ష్యాత్తూ ప్రధానిపై మితిమీరిన వ్యాఖ్యలు చేయడం పట్ల బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.