వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎజగన్మోహన్ రెడ్డిపై రూపొందించిన రావాలి జగన్.. కావాలి జగన్ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముక్కా రుపానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాశ్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన 6పాటల ఆల్బమ్ సీడీని జగన్ విడుదల చేశారు. సాయి వికాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడుకు ప్రజలు గుర్తుకొస్తారని, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచుతానని హామీ ఇచ్చేంతవరకు చంద్రబాబుకు పెన్షన్ పెంచాలనే ఆలోచనే రాలేదన్నారు.
వైసీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను నమ్మి రుణాలు కట్టని మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నారు. రైతులకు రుణ మాఫీ చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాలపై విస్తృత ప్రచారం అవసరమన్నారు. అందులో భాగంగానే తమ వంతు సహకారంగా పాటలను రూపొందించామని చెప్పారు. ఈ పాటలను పార్టీ శ్రేణులకు అందుబాటులోకి తెస్తామని, నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పార్టీ నాయకులు.