ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది .ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తిరుబాటు మొదలైంది. నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి తిరుగబడ్డారు. రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను కాల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్, ప్రతి గ్రామం తిరిగి పార్టీని పటిష్టం చేశానన్నారు. ఆ విశ్వాసం కృతజ్ఞత కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా తనను అవమానించారని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నమొన్నటి వరకు మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ రూరల్ టిక్కెట్ తనకే ఇస్తామని చెప్పారని, అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఫ్లేటు ఫిరాయించి, ఆదాలను అభ్యర్ధిగా ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత జయకుమార్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. తనను ఒక పనిముట్టుగా వాడుకున్నారని, నమ్మించి ద్రోహం చేశారని అనుచరుల వద్ద వాపోతున్నారు. ఈరోజు ఆయనను కలిసిన అనుచరులు పార్టీని వదిలిపెట్టాలని ఆయనపై ఒత్తిడి చేశారు. మరో రెండు రోజుల్లో జయకుమార్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.