ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘31 ఏళ్లుగా ఈ జిల్లా వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుంది. ఆయన అకాల మరణం తర్వాత నాకు, నా కుటుంబానికి అండగా ఉంది. జగన్ అనే నన్ను కొడుకుగా ఆదరించింది. మీ దీవెనలే నాకు కొండంత అండ. పదేళ్లుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాపై ఉంది. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందించడంలో మీ పాత్ర క్రియాశీలకం’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
