చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు.
దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడితో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్ డీఎస్పీ, ఎంఆర్ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడిపోయారు. దీంతో తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం అర్ధరాత్రి వరకు చెవిరెడ్డి ధర్నా చేపట్టారు.
నాగభూషణం, సిసింద్రీ అనే వ్యక్తులపై ఐపీసీ 323, 120 బీ, ఐపీసీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మీద దాడికి టీడీపీ నాయకులు కుట్ర చేయడం దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి డ్రైవర్లకి ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టానని, తాను పెట్టిన అన్నం తిన్నవారే తనపై రెక్కీ నిర్వహించడం బాధకరమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందునే దాడి చేసారని తెలుగుదేశం నాయకులు ఇంత దారుణంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు చెవిరెడ్డి.