తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేతలు మాత్రం భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయినప్పటికీ తాము బలంగా ఉన్నామన్నారు. పంచాయితీ ఎన్నికల్లో స్థానిక సర్దుబాట్ల వల్ల, తమ మద్దతుతో గణనీయ సంఖ్యలో సర్పంచులు గెలిచారని పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, రెండు విడతలుగా జిల్లాల అధ్యక్షులతో సమావేశం జరిగిందని వివరించారు. తెలంగాణాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీకి 8 లక్షల సభ్యత్వం ఉందన్నారు. తెలంగాణలో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు.
టీటీడీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై చర్చించినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల తెలిపారు. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలనే దానిపై జిల్లా అధ్యక్షులను నివేదిక ఇవ్వాలని.. పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ, పొత్తుల పై చంద్రబాబుదే తుది నిర్ణయమని స్పష్టం చేసారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు బరిలో దిగే సత్తా ఉందా అనేది…మనందరికీ తెలిసిన సంగతే!