తెలుగుదేశం పార్టీ ప్రచారం గురించి, ఆ పార్టీ నేతలు చేసుకునే అతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సందర్భం ఏదైనా తమ గురించి తాము డబ్బా కొట్టుకోవడంలో టీడీపీ నేతలను మించిన వారుండరనేది టాక్. అలా తాజాగా తమకు బాహుబలి దొరికాడని పచ్చపార్టీ నేతలు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబలి నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కావడం ఇందులో కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే…సంచలన, వివాదాస్పదన వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఈ బాహుబలి కబుర్లు చెప్పారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ బాహుబలి అని ఆయన ప్రకటించారు! దేవినేని ఆవినాష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బుద్దా వెంకన్న ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లా వైసీపీలో ఉన్న భల్లాల దేవుడు లాంటి వ్యక్తిపై అవినాష్ పోటీకి దిగుతాడని వ్యాఖ్యానించారు. అవినాష్ పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడన్న ఆయన… ఎన్నికల తర్వాత దేవినేని అవినాష్‌ని బాహుబలిగా పిలుస్తారన్నారు.
బుద్దావెంకన్న వ్యాఖ్యలు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉద్దేశించి పరోక్షంగా చేసినవని పలువురు అంటున్నారు. కాగా, కొడాలి నాని, బుద్దా వెంకన్న మధ్య పలు మార్లు మాటల యుద్ధం, సవాల్, ప్రతి సవాళ్లు నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న కొత్త సూత్రీకరణ చేశారంటున్నారు. అయితే, ఏ పార్టీలో ఉన్నా…బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తూ వస్తున్న కొడాలి నానిని ఎదుర్కునే సత్తా నిజంగా అవినాష్‌కు ఉందా అనేది అనేకమంది డౌట్.