ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయస్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్ ఉదయం 11 గంటలకు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. 1 గంటకు బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు.
బూత్ కమిటీ సభ్యులతో సంభాషించేలా నాలుగు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇది వరకు ఏ బహిరంగ సభలకూ లేని విధంగా ఈ సభకు ప్రత్యేక సదుపాయం కల్పించారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు, ప్రాంగణాన్నంతా వైసీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.