వైసీపీ నిర్వహిస్తున్న సమర శంఖారావం కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపుతుంది. ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో పనిచేసేందుకు అవసరమైన బూస్టింగ్, గైడెన్స్ ఇచ్చింది. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో అనేక కీలక విషయాలు, కొత్త విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ ల వరకూ ఓటర్లను నడిపించడం, ఎల్లో మీడియా చేయబోయే మాయను తిప్పికొట్టడం, డబ్బుల పంపిణీ ఎదుర్కోవడం, బాబు అనుకూల పోలీస్ లను ఎదుర్కోవడం, దొంగవోట్లు, ఓట్ల తొలగింపు.. ఇలా పలు విషయాలు పై కార్యకర్తలను జాగృతం చేసిన తీరు చాలా బాగుంది.
అలాగే చంద్రబాబు ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన డ్వాక్రాలకు రూ.10వేలు, వృద్ధులకు నెలకు రూ.2 వేలు పింఛన్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయవనుకోవడం పొరపాటే.. 2014లో రైతులకు రుణమాఫీ, ఆచరణకు సాధ్యం కాని 600 ఇతర హామీలను ప్రకటించినప్పుడు.. బాబును జనం నమ్మరులే అనుకుని వైయస్ఆర్ సీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కానీ ఫలితం వేరేలా వచ్చింది. నేడు కూడా బాబు ఎన్నికల ముందు ఇస్తున్న తాయిలాలు పట్ల వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో 2014లో కనబడిన దీమానే కనబడుతోంది. జనం డబ్బు తీసుకుని వైయస్ఆర్ సీపీకి ఓటేస్తారన్న భ్రమలు ఉన్నాయి చాలామందిలో.
కానీ గ్రౌండ్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. పింఛన్ల విషయంలో జగన్ ముందు చెప్పాడు కాబట్టి సగం సగం అభిప్రాయం ఉన్నా.. పసుపు కుంకుమ విషయంలో మాత్రం డ్వాక్రా గ్రూపులలో ఎక్కువమంది ప్రస్తుతం బాబు వైపే ఉన్నాయి. వీరు ఎన్నికల ముందు బాబు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీని మర్చిపోయారు. పైసలకున్న మహిమ అటువంటిది. ఎన్నికలైపోయిన మర్నాడే బ్యాంకులకు వెళ్లి రసీదు తెచ్చుకోండి. ఆ రోజు వరకు ఎంత అప్పు ఉందొ ఆ మొత్తం నాలుగు దఫాల్లో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చేతికే ఇస్తామని జగన్ గత రెండేళ్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు.
కానీ ఈ విషయాన్ని డ్వాక్రా మహిళల్లోకి తీసుకువెల్లే విషయంలో కచ్చితంగా వైఫల్యం కనబడుతోంది.ప్రస్తుతం రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, తటస్థ ప్రజలు, చిరువ్యాపారులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలూ జగన్ వైపే ఉన్నా.. బలమైన డ్వాక్రా గ్రూపులకు తాయిలాలు వేసి బాబు వారి ఓట్లను లాక్ చేస్తున్నాడు. చంద్రబాబు మాదిరిగా ప్రతీ వ్యక్తికో హామీ ఇచ్చి మోసం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి.. కేవలం డ్వాక్రా రుణాల మాఫీని మహిళల్లోకి బలంగా తీసుకెళ్లినా వైసీపీకి గెలుపు మరింత సులభం అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.