ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా ముఖ్యనేతలు టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే గుడ్‌భై చెప్పేయగా, ఇంకొందరు అదే దారిలో నడుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేతలే ఇంకొందరిని తమతో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధమవగా…ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి తనతో సమావేశం కావాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోన్ బాబుతో భేటీపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఇదే టెన్షన్లో టీడీపీ నేతలు ఉంటే… హఠాత్తుగా ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ప్రత్యక్షమయ్యారు.
రామచంద్రాపూరం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు.ఇప్పటికే టీడీపీ వైఖరిపై తోట త్రిమూర్తులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమయంలో ఆమంచి కృష్ణ మోహన్, తోట త్రిమూర్తులు భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరు నేతలు పలువురు కాపు నేతలతో మంతనాలు సాగించారు. దీంతో, ఆమంచి కృష్ణమోహన్, తోట త్రిమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. టీడీపీ నేతలకు కలవరం కలిగిస్తోంది. ఈ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అనే కలవరం మొదలైంది.