తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డారు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్లేనన్నారు. మీ అందరి బాగోగులు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటానన్నారు. రాజకీయంగా, సామజికంగా ఆదుకుంటా చాలా గర్వంగా చెబుతున్నా మీరందరూ నా కుటుంబసభ్యులే. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ పథకాలు అందించడంలో మీ పాత్ర కీలకం. న్యాయానికి, అన్యాయానికి ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలంటే మీరంతా కీలక బాధ్యత తీసుకోవాలంటూ అభిమానులను సొంత తమ్ముళ్లలా భావిస్తూ జగన్ మాట్లాడారు. చాలాచోట్ల వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు చేయిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు.. రానున్న ఎన్నికలు ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలని, అందరూ తనతో కలిసి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలని జగన్ కోరారు. జగన్ తమనుద్దేశించి ఎక్కువసేపు మాట్లాడడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
